మంగళ సూత్రం వెనకున్న శాస్త్రం ఏంటి..?

మంగళసూత్రం అంటే పవిత్రమైన సూత్రం అని అర్థం. భార్యాభర్తల మధ్య అనుభందానికి గుర్తే ఈ మంగళసూత్రం. పూర్వకాలం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ ఉన్న సమయంలో ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు లేకుండా బలవంతుడిదే రాజ్యం అనే విధంగా ఉండేది. అప్పట్లో కొన్ని కిరాతక జాతుల వారు వలస వచ్చారు. ఈ జాతుల వారు మరొక తెగకు చెందిన స్త్రీలను ఎత్తుకుపోయేవారు. అప్పుడు పురుషులు వారితో పోరాటం చేసి స్త్రీలను కాపాడుకునేవారు. కాలం గడిచేకొద్ది తమ స్త్రీలకు తాయత్తు లేదా తాడు వంటి వాటిని కట్టేవారు. ఆ రోజుల్లో మెడలో మంగళసూత్రం కనపడితే ఆ మహిళలను ఏమి చేసేవారు కాదట.

మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా.. కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం ఈ మంత్రం ఉద్దేశం ఏంటో తెలుసా ? పెళ్ళికొడుకునైన నేను పెళ్ళి కూతురివైన నీ మెడలో ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నీవు దీనిని ధరించి నా జీవితంలో అన్నింట సగభాగమై, నాకు తోడు నీడగా ఉంటు మనమిద్ధరం నిండు నూరేళ్ళు కలిసి ఆనందంగా జీవిద్దాం. అంటే పుణ్యస్త్రీగా ముత్తయిదువు గా జీవించు అని మంత్రం ఉద్దేశం.

మంగళ సూత్రంలో స్త్రీ శారీరక, మానసిక రక్షణ కొరకు ముత్యం, పగడం వాడతారు. మన పూర్వీకుల నుండే మంగళ సూత్రంలో ముత్యం, పగడం ధరించిన పాత తరం స్త్రీలలో వారు సంతానం కనే సమయంలో ఆపరేషన్ లేకుండానే సహజ సిద్ధంగా పిల్లలను కనేవారట. ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని ప్రస్తుత కాలంలో స్త్రీలలో కానుపు ఆపరేషన్‌తోనే జరగటం సర్వసాధారణమైపోయింది.

విషయానికి వస్తే.. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో నుండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ శరీర భాగంలోని అన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరచి శారీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాల వల్ల ఆరోగ్య పరంగా స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. కనుక చంద్ర, కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభఫలితాలు అందిస్తాయి.

స్త్రీలకు కుజ గ్రహ ప్రభావం వల్ల అతికోపం, కలహాలు, మొండితనం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్ భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు, శారీరకంగా ఉదరము, రక్తస్రావం, గర్భస్రావం, ఋతుదోషములు మొదలగునవి ఏర్పడతాయి. ప్రస్తుత కాలంలో మనదేశ స్త్రీలు ఎక్కువ శాతం ఎందుకు పనికిరాని ఉపయోగంలేని విదేశీ సాంప్రదాయ మోజులో పడి సనాతనమైన, ప్రయోజనకరమైన మనదేశ సాంప్రాదాయ ధర్మాన్ని మరచి అనారోగ్య బారిన పడుతున్నారు. డెలివరీలకు సర్వసాధారణంగా సీజేరియన్ లేనిదే పిల్లలను కనటం లేదని మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

శాస్త్రీయ సాంప్రదాయ పరంగా ఆరోగ్య పరంగా, జ్యోతిష పరంగా మంగళసూత్రాలు, మెట్టెలు, బొట్టు, గాజులు అనేవి స్త్రీని అన్ని విధాలుగా కాపాడుతూ, చక్కటి దేహాకాంతితో ఆరోగ్యకరమైన సంసార జీవనాన్ని కొనసాగించేలా చేస్తాయి. ఇవి లేకుండా ఉండటం ఎంత మాత్రం ఆరోగ్యదాయకం కాదు, ఏ విధంగా చూసినా మంచిది కాదు. విలువలు తెలియని వివాహాలు విడాకుల వరకు తీసుకువెలుతాయి, సాంప్రదాయ సంస్కారంలేని కుటుంబంలో కలతలు చోటు చేసుకుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *