మంగళసూత్రానికి నిజంగా అంత పవర్ ఉందా..?
సనాతన ధర్మాన్ని నమ్మే వివాహిత మహిళలకు మంగళసూత్రం చాలా ముఖ్యమైనది. హిందూ సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం వివాహానంతరం మహిళలు మంగళసూత్రాన్ని ధరించడం వారి వైవాహిక స్థితిని ప్రపంచానికి తెలియజేస్తుంది. వివాహమైన తర్వాత స్త్రీలు కళ్యాణపు ఉంగరాన్ని, కాలిమెట్టలను, మంగళ సూత్రాన్ని ధరించడం, నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం కుటుంబాన్ని నిర్వహించగలిగిన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. వీటిలో ముఖ్యంగా మంగళసూత్రం అత్యంత విలువైన ఆభరణంగా పరిగణించబడుతుంది.
మంగళసూత్రాన్ని ఎల్లప్పుడూ నల్లపూసలు మరియు దారంతో కట్టి ఉంచుతారు. ఈ నల్ల పూసలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూసలు లేకుండా మంగళసూత్రం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ నల్లపూసలు శివుడు మరియు తల్లి పార్వతి మధ్య బంధాన్ని సూచిస్తాయి. మంగళ సూత్రం అంటే మంగళకరమైన బంధం. పెళ్లి రోజున వరుడు వధువు మెడలో కట్టే ఒక ప్రత్యేకమైన, ఎన్నటికీ విడదీయలేని పవిత్రమైన అనుబంధమే మంగళసూత్రం. నిబద్ధతకు, ప్రేమకు, నమ్మకానికి చిహ్నంగా భర్త బ్రతికున్నంత కాలం భార్య మంగళ సూత్రాన్ని ధరించాలని చెబుతారు. మంగళసూత్రంలోని బంగారం పార్వతి తల్లికి ప్రతీకగా, నల్ల పూసలు శివునికి ప్రతీక అని నమ్ముతారు.
అంతే కాదు.. భార్య మెడలోని మంగళసూత్రం భర్తను అలాగే వివిధ రకాల దుష్టశక్తుల నుంచి కాపాడుతుంది. మంగళసూత్రాల విషయంలో స్త్రీలు కచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతి దేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నీసులు, ఏ ఇతర ఇనుముకి సంబంధించిన వస్తువులు పెట్టకూడదు. మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి. మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు (పగడం) నలుపు పూసలు ఉండాలి.
మంగళసూత్రం పెరిగితే ఏం చేయాలి..?
పొరపాటున మంగళసూత్రం పెరిగితే (తెగిపోతే) వెంటనే 5 వరసల దారం తీసుకుని ఆ దారానికి పసుపు రాసి పసుపు కొమ్మును కట్టి ఆ తాడును ఆడపడుచు చేత కాని భర్త చేత కాని వేయించుకోవాలి. ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మళ్లీ మంగళసూత్రాన్ని (బంగారు తాళిని) వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది. వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెపుతున్నాయి. పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవిగా ఉన్నాడంటే అది ఆయన గొప్ప కాదట, పార్వతీ దేవి మెడలో ఉన్న ఆ మంగళ సూత్ర మహిమే అని పురాణాల ద్వారా తెలుస్తుంది.