బాపట్లలో విషాదం..నడుముకు బాటిళ్లను కట్టుకుని..?
బాపట్ల జిల్లా పర్చూరులోని వీరన్నపాలేంలో విషాద ఘటన చోటుచేసుకుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పాలేరు జస్వంత్, ఇంటర్ సెకండియర్ చదువుతున్న మణికంఠ, డిప్లొమా చదువుతున్న రామరాజు ముగ్గురు ప్రాణ స్నేహితులు. వీరు ముగ్గురు ఖాళీ వాటర్ బాటిళ్లను నడుముకు కట్టుకుని నీటిలో దిగారు. ఆ సమయంలో జస్వంత్ కట్టుకున్న బాటిళ్ల తాడు ఊడిపోవడంతో లోతైన చెరువు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. మణికంఠ, రామరాజు ఒడ్డుకి చేరుకొని ఒక్కసారిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అందరూ అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జస్వంత్ కోసం గాలింపు చేపట్టారు. ఎక్కడా జాడ దొరక్కపోవడంతో చీరాల నుండి అగ్నిమాపక సిబ్బందిని రప్పించి రంగంలోకి దించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవడంతో జాతీయ విపత్తు నిర్వహణ శాఖ వారికి సమాచారం అందించారు. జాతీయ విపత్తు సిబ్బంది రాకముందే అగ్నిమాపక సిబ్బంది సోమవారం ఉదయం 6 గంటల సమయంలో మృతదేహాన్ని కనిపెట్టి వెతికి తీశారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన జస్వంత్ బంధువులు, తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. జస్వంత్ చీరాల భారతీ కళాశాలలో చదువుతున్నట్లు బంధువులు చెబుతున్నారు.